Sunday, August 11, 2019

ఇంటి రుణం తీర్చేదామనుకుంటున్నారా ...తొందర వద్దు...

ఇంటి రుణం  తీర్చేదామనుకుంటున్నారా ...తొందర వద్దు...  


జీవితంలో అతిపెద్ద పెట్టుబడి ఇల్లు.. అప్పు కూడా దీనికోసం తీసుకునే గృహరుణమే..వచ్చిన ఆదాయంలో సింహభాగం దీన్ని చెల్లించేందుకే సరిపోతుంది.. వాయిదాలు చెల్లిస్తున్నా.. వ్యవధి మాత్రం తగ్గనంటూ భయపెడుతూ ఉంటుంది. ఎంత తొందరగా వదిలించుకుందామా అంటూ.. చాలామంది పీఎఫ్‌, బోనస్‌లు, చిట్టీలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు.. ఇలా చేతిలో ఉన్న సొమ్మంతా కలిపి కొంతలో కొంతైనా ఈ భారాన్ని తగ్గించుకోవాలను కుంటారు.. మీరూ ఇలాగే ఆలోచిస్తున్నారా? అయితే.. ఒక్క క్షణం..

గృహరుణం వడ్డీ రేట్ల విషయంలో గత నాలుగైదు నెలలుగా పెద్దగా కదలికలు లేవు. కానీ, సమీప భవిష్యత్తులో ఇవి పెరిగే అవకాశం ఉందనే సంకేతాలు ఉన్నాయి. పెరిగే వడ్డీ భారాన్ని తప్పించుకునేందుకు అప్పు బరువు త్వరగా దించుకునేందుకు ఆలోచిస్తే మంచిదే. అయినప్పటికీ కొన్ని విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి..

గృహరుణం కన్నా అధిక వడ్డీ ఉన్న అప్పులు ఉన్నాయా ఒకసారి గమనించండి.. క్రెడిట్‌ కార్డు బిల్లులు, లేదా దానిపై తీసుకున్న రుణం, వ్యక్తిగత రుణంలాంటివి ఉంటే తొలుత వాటిని వదిలించుకునేందుకు ప్రయత్నించండి. క్రెడిట్ కార్డు బిల్లు బాకీ ఉంటే.. దాదాపు 36శాతం వడ్డీకి తగ్గదు.. మరీ ఇంతకాకపోయినా వ్యక్తిగత రుణాలపైనా.. 13 నుంచి 24శాతం వరకూ వడ్డీ ఉంటుంది. కాబట్టి, వడ్డీ అధికంగా ఉండే ఈ అప్పులను ముందుగా తీర్చేయండి.

ప్రస్తుతం గృహరుణాల వడ్డీ రేటు 8.60శాతం - 9.00 శాతం మధ్యలో ఉంది. నికరంగా చూస్తే ఈ భారం మరీ ఎక్కువేమీ కాదు.. ఇంటిరుణానికి చెల్లించే వడ్డీకి రూ.2,00,000 వరకూ, అసలుకు సెక్షన్‌ 80సీ నిబంధనల మేరకు ఆదాయపు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ఉదాహరణకు, మీరు 30 శాతం శ్లాబులో ఉన్నారని అనుకుందాం. అంటే, మీరు కట్టే ప్రతి రూపాయి వడ్డీకి 30 పైసలు పన్ను భారం తగ్గుతుంది. ప్రస్తుతం మీ రుణంపై వడ్డీ రేటు 9 శాతం అనుకుందాం. ఇందులో 3 శాతం పన్ను రాయితీ కింద లభిస్తుంది. దీన్ని తీసివేస్తే వాస్తవంగా మీరు చెల్లించే వడ్డీ 6 శాతమే అవుతుంది. ఇప్పుడు చెప్పండి మీ గృహరుణం రేటు మరీ ఎక్కువగా ఉందంటారా?

ఎంతసేపూ డబ్బును సంపాదించేందుకు మనం కష్టపడటం కాదు.. మన కోసం డబ్బును కష్టపడాలని చెప్పాలి. ఒక ఆదాయంతో ధనవంతులు కావడం ఎప్పుడూ కష్టమే. మరి, ఈ రెండో ఆదాయం ఎలా? పెట్టుబడులే అందుకు ఆధారం. మిగులు మొత్తాన్ని ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడినిచ్చే పథకాల్లో మదుపు చేసేందుకు ప్రయత్నించాలి. దాని నుంచి వచ్చే రాబడే మనకు రెండో రాబడిగా మారుతుంది. ఒకటికి రెండు ఆదాయాలు తోడైతేనే మన సంపద వృద్ధి చెందుతుంది.

* మరో ముఖ్యమైన విషయం... మీరు ఒక రూ.50వేలు అసలుకు చెల్లించారు అనుకుందాం.. ఇలాంటప్పుడు ఈఎంఐ తగ్గడం లేదా వ్యవధి తగ్గించుకోవాలా అనేది మీపైనే ఆధారపడి ఉంటుంది. మీరు రూ.20లక్షల ఇంటి రుణం, 20 ఏళ్ల వ్యవధికి తీసుకున్నారనుకుందాం. వడ్డీ 8.60శాతం. మీకు ఈఎంఐ రూ.17,483 అవుతుంది. ఇలా 240 నెలలు చెల్లిస్తే.. మొత్తం రూ.41,95,981 అవుతుంది. అదే.. ఐదేళ్ల తర్వాత అంటే 60 నెలల తర్వాత ఓ రూ.లక్ష ఇంటిరుణం అసలుకు చెల్లించారనుకుందాం.. అప్పుడు ఈఎంఐ తగ్గించుకుంటే.. నెలకు రూ.16,493 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే.. మొత్తంగా మీరు రూ.41,17,671 చెల్లించినట్లు అవుతుంది. అప్పుడు మీకు మిగిలే మొత్తం రూ.78,310. ఒకవేళ వ్యవధి తగ్గిస్తే..19 నెలలు తగ్గి, 161 నెలలకు చేరుతుంది. మీరు మొత్తం చెల్లించేది రూ.39,57,579. ఇలా చేస్తే రూ.2,38,402లు మిగులుతుంది.



* ఇక ఈ రూ.1,00,000ను రుణం తీర్చకుండా ఈక్విటీల్లో మదుపు చేశారనుకుందాం.. కనీసం 12 శాతం రాబడి అంచనాతో..15 ఏళ్లలో రూ.5,45,356 అయ్యే అవకాశం ఉంది. దీన్ని బట్టి, అప్పు తీర్చాలా.. మదుపు చేయాలా అనేది నిర్ణయించుకోవచ్చు.

* తనకంటూ సొంతిల్లు ఉంటుందన్న భావనతో పాటు... పన్ను భారం తగ్గించుకోవచ్చనే కారణంతోనూ మనలో ఎక్కువ మంది రుణం తీసుకుంటాం కదా. వడ్డీ విషయంలో ఏడాదికి రూ.2లక్షలకు మినహాయింపు లభిస్తుంది. అసలు విషయానికి వస్తే, సెక్షన్‌ 80సి పరిమితి వర్తిస్తుంది. కాబట్టి, భవిష్యనిధి (పీఎఫ్‌), ప్రజాభవిష్య నిధి (పీపీఎఫ్‌), ట్యాక్స్‌ సేవింగ్‌ ఫండ్స్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌), యూనిట్‌ ఆధారిత బీమా పథకా(యులిప్‌)లు, జాతీయ పొదుపు పత్రం (ఎన్‌ఎస్‌సీ), జీవిత బీమా ప్రీమియం, పిల్లలకు చెల్లించిన ట్యూషన్‌ ఫీజు... ఇలా అన్నీ కలిపి గరిష్ఠంగా రూ.1,50,000 వరకూ మినహాయింపులు క్లెయిము చేసుకోవచ్చు. మీరు తీర్చే గృహరుణ బాకీ కూడా ఇందులోనే వస్తుంది. కాబట్టి, అధికశాతం 20 లేదా 30శాతం శ్లాబులో ఉన్నవారు గృహరుణాన్ని కొనసాగించడమే మేలు.

మదుపే మేలు.. 

సెక్షన్‌ 80సి కింద పొదుపు పరిమితి దాటేసిన వాళ్లు గృహరుణాన్ని గడువుకు ముందే తీర్చటం కంటే, అదనపు సొమ్మును మదుపు చేయటమే లాభదాయకం. పన్ను రాయితీలనే పరిగణనలోకి తీసుకుంటే, వడ్డీ రేటును బట్టి మీరు వాస్తవంగా చెల్లించేది 6-7 శాతం లోపే ఉంటుంది. ఇలాంటి రుణాన్ని తొందరపడి గడవుకు ముందే తీర్చటం కంటే, మదుపు చేయటమే మేలు. బ్యాంకు ఫిక్సెడ్‌ డిపాజిట్‌లో మదుపు చేసినా ఎలాంటి నష్టభయం లేకుండా 7-8 శాతం వరకూ రాబడి అందుకోవచ్చు.

* ఈక్విటీ ఫండ్స్‌లో మదుపు చేశారనుకోండి... నష్టభయం ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో 12-14 శాతం వరకూ రాబడి ఆర్జించే అవకాశం ఉంది.

* అనుకోకుండా సొమ్ము వచ్చినప్పుడు రుణం తీర్చే విషయాన్ని పరిశీలించవచ్చు. ఇది కూడా మీ ఆదాయపు పన్ను, మీ పదవీ విరమణ వయసును పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుత నిబంధనల ప్రకారం వ్యవధికి ముందుగా రుణం తీర్చినా ఎలాంటి రుసుములూ లేవు.

 --ఈనాడు  సహకారంతో ... 

0 comments:

Post a Comment