Sunday, July 16, 2017

ఉద్యోగులకు ఆరోగ్య పరీక్షలు

ఉద్యోగులకు ఆరోగ్య పరీక్షలు 

➖ తొలివిడతలో వయస్సుతో నిమిత్తం లేకుండా అందరికీ
➖ మలివిడత పరీక్షలు 40 ఏళ్లు దాటిన వారికి మాత్రమే
ఈనాడు - అమరావతి
        *ఉద్యోగులకు, పెన్షనర్లకు త్వరలో పూర్తి స్థాయి ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. మగ వారికి 27, మహిళలకు 28 రకాల పరీక్షలు చేయనున్నారు. ఉద్యోగి భార్య లేదా భర్త; పెన్షనర్‌ భార్య లేదా భర్తకు మాత్రమే ఈ పరీక్షలు చేయనున్నారు. టెండరు ద్వారా ఎంపిక చేసిన ఆస్పత్రులు, ల్యాబొరెటరీల్లో వీటిని నిర్వహిస్తారు. తొలిదఫాలో మాత్రం వయస్సుతో నిమిత్తం లేకుండా పరీక్షలుంటాయి. సుమారు 8.5 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. రెండో విడత నుంచి 40 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే చేస్తారు. టెండరు ద్వారా సంస్థల ఎంపికకు 45 రోజుల నుంచి రెండు నెలల వరకు గడువు అవసరం అవుతుంది. దీనికి అనుగుణంగా ఈ పథకాన్ని సెప్టెంబరు నాటికి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. సచివాలయంలో శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం జరిగినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ చెప్పారు. ఆరోగ్య పరీక్షలకు (మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌కు) మగవారికి 2110, మహిళలకు 2200 రూపాయల వరకు వ్యయమవుతుంది. ఇందులో ప్రభుత్వం 50%, ఉద్యోగులు 50% భరించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద రాష్ట్ర ఖజానాపై 230 కోట్ల రూపాయల వరకు భారం పడుతుందని సమాచారం. మగ వారికి 27, ఆడవారికి 28 రకాల పరీక్షలు నిర్వహించిన అనంతరం వచ్చే ఫలితాల్ని అనుసరించి అదనంగా అల్ట్రాసౌండ్‌, విటమిన్‌-డి3, ప్రోస్టేట్‌ గ్రంథి, క్యాన్సర్‌ పరీక్షలు చేయించుకునే అవకాశాన్ని కల్పిస్తారు. అంతేకాకుండా మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌ కింద ఆఫ్తామాలజీ, గైనకాలజీ వైద్యులను, ఫిజీషియన్‌ను సంప్రదించే అవకాశాన్ని కల్పిస్తారు. ఈ పరీక్షల వల్ల ఆరోగ్య స్థితిగతులు తెలిసి ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులను ఎలా సమకూర్చాలి తదితర అంశాలపై ప్రభుత్వానికి తగిన అవగాహన వస్తుంది.